Cheetah: ముందే ఊహించాం.. చీతాల మృతిపై సౌతాఫ్రికా
- ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మరణాల రేటు ఉంటుందన్న సౌతాఫ్రికా డీఎఫ్ఎఫ్ఈ
- ప్రస్తుతం క్లిష్టమైన దశ కొనసాగుతోందని ప్రకటన
- చిరుత మరణానికి సంబంధించిన శవపరీక్ష కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన రెండు చీతాలు చనిపోయిన విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి చనిపోయాయి. అయితే ఈ విషయాన్ని తాము ముందుగానే ఊహించామని దక్షణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (డీఎఫ్ఎఫ్ఈ) తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
‘‘ఇప్పటి వరకు రెండు చిరుతల మరణాలు (ఒకటి నమీబియా నుంచి తెచ్చినది, ఇంకొకటి దక్షిణాఫ్రికా నుంచి తెచ్చినది) నమోదయ్యాయి. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మరణాల రేటు ఉంటుందని మేం గతంలోనే అంచనా వేశాం’’ అని వివరించింది.
‘‘పెద్ద మాంసాహార జంతువులను ఇంకో చోటకు తరలించి, జాగ్రత్తగా చూసుకోవడమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. సహజంగానే ఇలాంటి పునరావాసమనేది ప్రమాదకర వ్యవహారం. ప్రస్తుతం సాగుతున్నది ప్రాజెక్టులోని క్లిష్టమైన దశ. చిరుతలను పెద్ద వాతావరణంలోకి విడుదల చేస్తారు. అక్కడ వాటి రోజువారీ పరిస్థితిపై నియంత్రణ చాలా తక్కువగా ఉంటుంది. గాయాలు, మరణాల ప్రమాదాలు పెరుగుతాయి. ఇవన్నీ ఈ ప్రాజెక్టులో భాగమే’’ అని వివరించింది.
‘‘చిరుత మరణానికి సంబంధించిన శవపరీక్ష కోసం అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ ఎదురుచూస్తోంది. చనిపోయిన చిరుతకు ఏదైనా అంటు వ్యాధి సోకిందా? ఇతర చిరుతలకు ఇలాంటి ప్రమాదం ఏదైనా ఉందా? అనే దానిపై ఎలాంటి సూచన లేదు’’ అని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. అందులో ఉదయ్ ఒకటి. గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన సాషా ఈ ఏడాది మార్చిలో కన్నుమూసింది. ఇప్పుడున్న చీతాల సంఖ్య 20 నుంచి 18కి పడిపోయింది.