Manish Sisodia: మనీ లాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ నిరాకరణ
- విచారణకు కస్టడీ అవసరం లేదని రిలీవ్ కోరుతూ సిసోడియా పిటిషన్
- దర్యాఫ్తు కీలకమైన దశలో ఉందని చెప్పిన ఈడీ
- ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి
ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్... సిసోడియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ను మంజూరు చేయలేమని చెబుతూ, పిటిషన్ ను తిరస్కరించారు.
విచారణకు ఇకపై కస్టడీ అవసరం లేదని రిలీవ్ కోరుతూ సిసోడియా వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. ఈడీ ఈ పిటిషన్ ను వ్యతిరేకించింది. దర్యాప్తు కీలకమైన దశలో ఉందని తెలిపింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తమ కొత్త మద్యం పాలసీకి ప్రజామోదం ఉందని చెప్పేందుకు నకిలీ ఈ-మెయిల్స్ వాడారని కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది.
ఈ నేరంలో అతని భాగస్వామ్యానికి తాజా సాక్ష్యాలను గుర్తించినట్లు తెలిపింది. దాదాపు రూ.90 కోట్ల నుండి రూ.100 కోట్లను ముడుపులుగా చెల్లించిన నేరపూరిత కుట్రలో మనీశ్ కీలకమని పేర్కొంది. మరోవైపు, సీబీఐ విచారిస్తున్న అవినీతి కేసులో సిసోడియా బెయిల్ దరఖాస్తును మార్చి 31న కోర్టు కొట్టివేసింది.