Richard Sharp: బీబీసీ చైర్మన్ పదవికి రిచర్డ్ షార్ప్ రాజీనామా... ఎందుకంటే!
- నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ కు రుణం ఇప్పించిన అంశం
- బీబీసీ చైర్మన్ గా నియమితులైనప్పుడు రుణం ఇప్పించిన అంశం వెల్లడించలేదని షార్ప్ పై ఆరోపణ
- ఇందులో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా నిబంధనల ఉల్లంఘన
బ్రిటన్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ చైర్మన్ రిచర్డ్ షార్ప్ తన పదవికి రాజీనామా చేశాడు. 2021లో నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు రుణం ఇప్పించిన విషయంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని ఓ దర్యాఫ్తులో తేలింది. దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
షార్ప్ బీబీసీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు తాను ఈ పదవిపై ఆసక్తితో ఉన్నట్లు బోరిస్ కు చెప్పారు. ఆయనకు పెద్ద మొత్తంలో రుణం ఇప్పించడంలో సాయపడ్డారు. అయితే బీబీసీ చైర్మన్ పదవి నియామకం సమయంలో ఈ విషయాలను రిచర్డ్ వెల్లడించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందులోని నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాఫ్తు చేపట్టారు. ఈ దర్యాఫ్తులో ఆయన ఈ విషయాలను వెల్లడించలేదని తేలింది. దీంతో శుక్రవారం ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి నియామకం వరకు తాను పదవిలో కొనసాగుతానని చెప్పారు.
రిచర్డ్ 2021లో బీబీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయనకు గతంలో బ్యాకింగ్ రంగంలో నిపుణుడిగా అనుభవం ఉంది.