Hyderabad: మ్యాన్ హోల్ లో పడి చిన్నారి మృతి.. హైదరాబాద్ లో దారుణం

9 years kid died after falling into manhole in hyderabad

  • భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న మ్యాన్ హోల్స్
  • పాల ప్యాకెట్ కోసం వెళ్లి డ్రైనేజీలో పడిపోయిన మౌనిక
  • పార్క్ లైన్ వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన డీఆర్ఎఫ్ సిబ్బంది

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఉదయం కురిసిన భారీ వర్షానికి మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడలో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి చనిపోయింది. పాలప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. పార్క్ లైన్ వద్ద మౌనిక మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. చిన్నారి మరణానికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

నగరంలో శనివారం ఉదయం భారీగా వర్షం కురవడంతో రోడ్లు జలమయంగా మారాయి. డ్రైనేజీలు వరదతో నిండిపోయి మ్యాన్ హోల్స్ నుంచి నీరు పొంగిపొర్లుతోంది. కళాసీగూడలో ఓ మ్యాన్ హోల్ తెరిచి ఉంచడంతో ప్రమాదం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారి మౌనిక ఈ మ్యాన్ హోల్ లో పడి గల్లంతయ్యింది. విషయం తెలిసి డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. చిన్నారి కోసం గాలించగా.. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహం బయటపడింది. 

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన పాప ఇలా మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కాగా, చిన్నారి మౌనిక మరణంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. మౌనిక మరణంపై విచారం వ్యక్తం చేసిన మేయర్.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News