Shirdi: బాబా భక్తులకు గుడ్ న్యూస్.. షిర్డీ బంద్ పై వెనక్కి తగ్గిన స్థానికులు
- మంత్రి హామీతో బంద్ పిలుపు ఉపసంహరణ
- సీఐఎస్ఎఫ్ భద్రతపై న్యాయపోరాటం చేస్తామన్న మంత్రి రాధాకృష్ణ పాటిల్
- స్థానికుల డిమాండ్లకు తలొగ్గిన మహారాష్ట్ర సర్కారు
షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. మే 1 నుంచి షిర్డీలో బంద్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్థానికులు ఉపసంహరించుకున్నారు. మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్ హామీతో వెనక్కి తగ్గారు. బంద్ కొనసాగించట్లేదని ప్రకటించారు. షిర్డీలో సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని షిర్డీ సంస్థాన్ స్వాగతించగా.. స్థానికులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీ బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపార సంస్థలతో పాటు అన్నింటినీ మూసివేస్తామని ప్రకటించారు.
సీఐఎస్ఎఫ్ భద్రత అవసరంలేదంటూ స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. స్థానికుల డిమాండ్లకు తలొగ్గి సీఐఎస్ఎఫ్ భద్రత విషయంలో న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఈమేరకు మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్ స్థానికులతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతోపాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు సానుకూలంగా స్పందించారు. షిర్డీ బంద్ పిలుపును ఉపసంహరించుకున్నారు.