Yulu Wynn: రూ.55 వేలకే ‘యులూ’ ఈ స్కూటర్.. బుకింగ్ లు ప్రారంభం
- రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకునే ఏర్పాటు
- పరిమిత కాలం పాటే ఈ ధర
- తర్వాత రూ.59,999కు పెరగనున్న విక్రయ ధర
- బజాజ్ చేతక్ టెక్నాలజీ తయారీ
అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. యులూ విన్ పేరుతో విడుదలైన దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.55,555. ఇది పరిమిత కాలం పాటు మాత్రమే ఉండే ధర. ఆఫర్ పీరియడ్ తర్వాత ధర రూ.59,999కు పెరుగుతుంది. కేవలం రూ.999 చెల్లించడం ద్వారా ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే ఈ మొత్తాన్ని వెనక్కి తిరిగి చెల్లిస్తారు.
యులూ విన్ స్కూటర్ నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇది గంటకు 25 కిలోమీటర్లు మించి వేగంగా వెళ్లదు. కనుక రవాణా చట్టం నిబంధనల కింద డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. బజాజ్ ఆటో అనుబంధ కంపెనీ అయిన సీటీఎల్ (చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్) యులూ స్కూటర్లను తయారు చేయనుంది.
ఈ స్కూటర్ సింగిల్ సీట్ తో ఉంటుంది. చిన్నగా, తక్కువ బరువుతో పట్టణాల్లో నడిపేందుకు అనుకూలంగా ఉంటుంది. ఉన్న ఒక్క సీటులో మరొకరు సర్దుకుని కూర్చున్నా, కాళ్లు పెట్టుకునేందుకు ఫూట్ పెడల్స్ ఏర్పాటు చేయలేదు. ఈ స్కూటర్ లో ఉన్న ఆకర్షణ బ్యాటరీ లేకుండా స్కూటర్ కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల 40 శాతం ధర తగ్గుతుంది. స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్ తో వస్తుంది. కనుక కంపెనీ ఏర్పాటు చేసే స్వాపబుల్ బ్యాటరీ స్టేషన్ల వద్ద కనీస డిపాజిట్ చేసి బ్యాటరీ తీసుకోవచ్చు. ఈ స్కూటర్ లో ఎన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంట్లోనే చార్జ్ చేసుకోవాలని అనుకునే వారు రూ.55 వేలకు (రోడ్డు పన్నులు అదనం) స్కూటర్, దీనితోపాటు చార్జర్ కొనుగోలు చేసుకోవాల్సిందే. స్కార్లెట్ రెడ్, మూన్ లైట్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. మే నెల మధ్య భాగం నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది.