Byjus: బైజూస్ సీఈవో రవీంద్రన్ పై ఈడీ కేసు నమోదు... ఏపీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
- చిక్కుల్లో బైజూస్
- ఫెమా ఉల్లంఘనల కింద ఈడీ తనిఖీలు
- బెంగళూరులో రవీంద్రన్ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు
- పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం
ఈ-లెర్నింగ్ యాప్ బైజూస్ సీఈవో రవీంద్రన్ బైజూపై ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. బెంగళూరులో రవీంద్రన్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల (ఫెమా) ఉల్లంఘన కింద ఈడీ తనిఖీలు చేపట్టింది.
మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈడీ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి 2023 వరకు ఆ సంస్థ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద రూ.28 వేల కోట్ల మేర నిధులు అందుకున్నట్టు గుర్తించినట్టు ఓ అధికారి తెలిపారు. అదే సమయంలో, విదేశాల న్యాయ పరిధిలో రూ.9,754 కోట్ల మేర చెల్లింపులు చేసినట్టు భావిస్తున్నారు.
అంతేకాదు, బైజూస్ కంపెనీ 2020-21 నుంచి ఆర్థిక వివరాలు నమోదును చేపట్టలేదని, తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఆడిట్ ను కూడా జరపలేదని ఓ అధికారి వివరించారు.
కాగా, బైజూస్ పై ఈడీ దాడుల నేపథ్యంలో, ఏపీ సర్కారుపై విపక్షాలు ధ్వజమెత్తాయి. బైజూస్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందాన్ని తప్పుబట్టాయి. బైజూస్ పై జగన్ ప్రభుత్వానికి వల్లమాలిన ప్రేమ అని విమర్శించాయి.
విద్యార్థులకు ఉచిత కంటెంట్ కోసం ఏపీ ప్రభుత్వం బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. బైజూస్ కంటెంట్ ను విద్యార్థులకు చేరువ చేసేందుకు జగన్ సర్కారు రూ.500 కోట్ల వ్యయంతో ట్యాబ్ లు కొనుగోలు చేసింది.