Bandi Sanjay: వరుస మరణాలకు బాధ్యతగా మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి: బండి సంజయ్
- సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్ లో పడి చిన్నారి మృతి
- ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యమే కారణమన్న సంజయ్
- మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
హైదరాబాద్ లో వర్షాలు మరో ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడలో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి పదేళ్ల మౌనిక అనే బాలిక చనిపోయింది. ఈ విషాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. మ్యాన్‌హోళ్లు, గుంతలు, వీధికుక్కల కారణంగా నగరంలో వరుస మరణాలకు బాధ్యత వహిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘సికింద్రాబాద్‌లో పదేళ్ల మౌనిక తన సోదరుడికి సహాయం చేయాలనే ప్రయత్నంలో కాలువలో పడి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఇది కచ్చితంగా ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యంగానే జరిగింది. మ్యాన్‌హోళ్లు, గుంతలు, వీధికుక్కల కారణంగా వరుస మరణాలకు బాధ్యత వహిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేల్కొనాలంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? డ్రోన్ షాట్ల ఫాంటసీ ప్రపంచం ఈ వాస్తవాలను దాచిపెడుతుంది. అన్ని ఓపెన్ డ్రెయిన్లు మ్యాన్‌హోల్‌లను తక్షణమే సమీక్షించి, మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిని భద్రపరిచేలా చూడాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సంజయ్ ట్వీట్ చేశారు.