Rains: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలే!
- తెలంగాణలో విస్తారంగా వర్షాలు
- రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ప్రభావం
- ఇవాళ కూడా హైదరాబాద్ ను ముంచెత్తిన వాన
- నేడు, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఇది వేసవి కాలమా లేక వర్షాకాలమా అనిపించేలా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కొన్నిరోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉదయం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగింది.
తాజాగా, తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక చేసింది.
కాగా, హైదరాబాద్ లో ఇవాళ కురిసిన భారీ వర్షానికి మౌనిక అనే చిన్నారి మ్యాన్ హోల్ లో పడి మృతి చెందడం తెలిసిందే. కళాసిగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో, జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. వర్క్ ఇన్ స్పెక్టర్ హరికృష్ణ, బేగంపేట డివిజన్ ఏఈ తిరుమలయ్యను సస్పెండ్ చేసింది. ఘటనపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు.