Jagga Reddy: కొత్త సచివాలయం గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను: జగ్గారెడ్డి
- రేపు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
- రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బాగా లేవన్న జగ్గారెడ్డి
- గతంలో విపక్ష నేతలు సచివాలయానికి వచ్చి ప్రభుత్వంతో చర్చించేవారని వెల్లడి
- కొత్త సచివాలయంలో సీఎం నిరంతరం అందుబాటులో ఉండాలని హితవు
తెలంగాణ నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు బాగాలేవని, కొత్త సచివాలయం గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని తెలిపారు.
గతంలో ప్రతిపక్ష నేతలు సచివాలయానికి వచ్చి ప్రభుత్వంతో చర్చించిన సందర్భాలు ఉండేవని వెల్లడించారు. ప్రగతి భవన్ లోకి మంత్రులు, బీఆర్ఎస్ నేతలను కూడా కేసీఆర్ అడుగుపెట్టనివ్వలేదని ఈటల రాజేందర్ అన్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈటల బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేసుంటే స్పందించేవాడ్నని వివరించారు.
కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయంలో విపక్షాలు, ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని జగ్గారెడ్డి సూచించారు.