SRH: ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ పోరు... టాస్ అయితే గెలిచారు!
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు
- హ్యారీ బ్రూక్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన పంపాలని నిర్ణయం
- వరుసగా విఫలమవుతున్న బ్రూక్
గతవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సొంతగడ్డపై ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ప్రతీకారం తీర్చుకునే అవకాశం నిలిచింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
వాషింగ్టన్ సుందర్ గాయంతో జట్టుకు దూరమైన నేపథ్యంలో, సన్ రైజర్స్ తరఫున వెస్టిండీస్ బౌలర్ అకీల్ హోసీన్ ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేస్తున్నాడు. హార్డ్ హిట్టర్ అబ్దుల్ సమద్ కూడా జట్టులోకి వచ్చాడు. ఇక, వరుసగా విఫలమవుతున్న ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన పంపించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ బరిలో దిగారు.
సన్ రైజర్స్ ఈ టోర్నీలో ఇంకా 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, ఇకపై ప్రతీ మ్యాచ్ చావోరేవో కానుంది. ఇప్పటికే 2 విజయాలే నమోదు చేసిన సన్ రైజర్స్, మిగిలిన మ్యాచ్ ల్లో కనీసం 5 విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్ దశపై ఆశలు పెట్టుకోగలుగుతుంది.