SRH: మొదట శర్మ, ఆ తర్వాత క్లాసెన్ భలే బాదారు... సన్ రైజర్స్ భారీ స్కోరు
- అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు
- 67 పరుగులు చేసిన అభిషేక్ శర్మ
- 53 పరుగులు సాధించిన క్లాసెన్
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ దంచికొట్టారు. వారికితోడు అబ్దుల్ సమద్, అకీల్ హోసీన కూడా తలో చేయి వేశారు. దాంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) స్వల్ప స్కోరుకు అవుటైనా అభిషేక్ శర్మ మాత్రం దూకుడుగా ఆడి స్కోరుబోర్డును పరిగెత్తించాడు. శర్మ 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 67 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (10), కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమయ్యారు. ఓపెనర్ గా రాణించలేకపోతున్న హ్యారీ బ్రూక్ ను మిడిలార్డర్ లో పంపినా ఫలితం లేకపోయింది. కేవలం రెండు బంతులే ఆడి డకౌట్ అయ్యాడు.
ఈ దశలో క్లాసెన్ ధాటిగా ఆడాడు. క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ 21 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 28 పరుగులు చేయగా, అకీల్ హోసీన్ 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
ఇక 198 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు ఆరంభంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ (0) వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో బంతిని వికెట్లపైకి ఆడుకున్న వార్నర్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది.