Japan: జపాన్ మహిళల గొప్ప విజయం.. అబార్షన్ పిల్‌కు ప్రభుత్వ ఆమోదం!
- జపాన్‌లో పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని అబార్షన్లు
- శస్త్రచికిత్స కోసం వేలాది రూపాయలు వదిలించుకుంటున్న మహిళలు
- లైన్‌ఫార్మా అబార్షన్ పిల్‌కు జపాన్ ఆమోద ముద్ర
- ఈ డ్రగ్‌తో 9 వారాల వరకు గర్భాన్ని తొలగించుకునే అవకాశం
జపాన్ మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వంపై పోరాడి తమ హక్కును సాధించుకున్నారు. ఫలితంగా తొలిసారి ఆ దేశంలో అబార్షన్ పిల్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. గర్భం వచ్చిన తొలినాళ్లలో దానిని తొలగించుకునేందుకు అబార్షన్ పిల్ ఉపయోగిస్తారు. జపాన్‌లో 22 వారాల గర్భాన్ని తొలగించుకోవడం చట్టబద్ధమే. అయితే, అందుకు భాగస్వామి/పార్ట్‌నర్ అంగీకారం తప్పనిసరి.
బ్రిటిష్ కంపెనీ లైన్‌ఫార్మా తయారుచేసే అబార్షన్ పిల్‌కు శుక్రవారం జపాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ డ్రగ్‌కు ఆమోదం కోరుతూ డిసెంబరు 2021లో ప్రభుత్వానికి లైన్‌ఫార్మా నివేదించింది. ఇది మిఫెప్రిస్టోన్, మిసోప్రొస్టోల్‌తో కూడిన రెండు దశల చికిత్సను అందిస్తుంది. అబార్షన్ పిల్‌కు ఆమోదం తెలిపిన తొలి దేశంగా ఫ్రాన్స్ రికార్డులకెక్కింది. అది 1988లో దీనిని ఆమోదించింది. 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో ఈ డ్రగ్ అందుబాటులోకి వచ్చింది.
లైన్‌ఫార్మా తయారుచేస్తున్న ఈ అబార్షన్ పిల్‌తో 9 వారాల వరకు గర్భాన్ని తొలగించుకోవచ్చు. అయితే, అంతకుముందు వైద్యుడి సంప్రదింపు తప్పనిసరి. జపాన్‌లో అబార్షన్లు పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాకపోవడంతో వీటి కోసం మహిళలు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, ఇప్పుడీ అబార్షన్ పిల్‌తో ఆ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.