Karnataka: దేశంలోనే తొలిసారిగా ‘ఓట్ ఫ్రం హోమ్’ మొదలు.. ఎక్కడంటే!
- కర్ణాటక ఎన్నికల్లో సరికొత్త విధానం
- పోలింగ్ బూత్ కు రాలేని వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు అవకాశం
- వాళ్ల ఇంటి వద్దకే బ్యాలెట్ తీసుకెళ్లి ఓటు నమోదు చేసుకుంటున్న అధికారులు
మన దేశంలో ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇస్తారు. కానీ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి దేశ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల ఇంటి వద్దకే వెళ్లి పోలింగ్ నిర్వహించే ‘ఓట్ ఫ్రం హోమ్’ విధానం కర్ణాటకలో నిన్న ప్రారంభమైంది. కర్ణాటక అసెంబ్లీకి మే 10న పోలింగ్ జరగనుంది. అయితే, పోలింగ్ కేంద్రానికి రాలేని 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ తమ ఇళ్ల నుంచే ఓటు వినియోగించుకునే కొత్త సంప్రదాయానికి ఎన్నికల కమిషన్ ఈసారి తెరలేపింది. ఇంటివద్దనే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చింది.
ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇలాంటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి వారికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ పోలింగ్ ప్రక్రియ మే 6 వరకు జరగనుందని తెలిపింది. ఇలా ఇంటి నుంచి ఓటు వినియోగించుకునే వృద్ధులు 80,250 మందిని, దివ్యాంగ ఓటర్లు 19,279 మందిని గుర్తించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.