Revanth Reddy: కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం
- సచివాలయ ప్రారంభోత్సవం అధికారికం, కానీ నిబంధనలు పాటించలేదన్న రేవంత్
- సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామని వ్యాఖ్య
- అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష తప్పదని హెచ్చరిక
కొత్త సచివాలయ ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమమని, కానీ సీఎంవో ఎక్కడా నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవించేదన్నారు. కేసీఆర్ సొంత కార్యక్రమంలా ప్రారంభోత్సవం చేశారన్నారు. గవర్నర్ ను సైతం ఆహ్వానించలేదన్నారు. విపక్షాలను ఆహ్వానించడంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు.
తెలంగాణ సచివాలయం, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగిందని కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరుపుతామన్నారు. దోషులను శిక్షిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష తప్పదన్నారు. సచివాలయ నిర్మాణం అంచనాలను పెంచారని ఆరోపించారు.
సీఎం కనీసం ఆహ్వానించలేదు: వీహెచ్
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను గౌరవించేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కానీ సచివాలయ ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడుతూ... ఎవరైతే అవినీతి చేశారో వారిని తీసేస్తానని కేసీఆర్ చెప్పారని, అంటే అప్పుడు అవినీతి జరిగిందనే అర్థం కదా అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెబితే ఓవైసీ, కేసీఆర్ మాట్లాడటం లేదని మండిపడ్డారు.