Narendra Modi: బెయిలుపై ఉన్నవారు అవినీతిని అరికడతామంటే నమ్మేదెలా?: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోదీ
- అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నందుకే తనను విమర్శిస్తున్నారన్న మోదీ
- చివరికి తనను విషసర్పంతో పోల్చారని ఆవేదన
- కాంగ్రెస్-జేడీఎస్‌లు ప్రత్యర్థులుగా నటిస్తుంటాయని ఎద్దేవా
వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి బెయిలుపై బయట ఉన్నవారు అవినీతిని అంతం చేస్తామని చెబితే నమ్మేదెలా? అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఆయన కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాచరిక కుటుంబాలకు చెందిన వారు అవినీతి కుంభకోణాల్లో భాగస్వాములుగా తేలారని, ఇప్పుడు వారు బెయిలుపై బయట ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. అలాంటి వారు ఇప్పుడు అవినీతిని అరికడతామంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో 2014 వరకు రూ. 5 వేల కోట్ల అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే బీజేపీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో లక్ష కోట్ల రూపాయల నగదును జప్తు చేసిందని గుర్తు చేశారు. అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నందుకే తనను విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు. చివరికి తనను విషసర్పంతో కూడా పోల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, శివుడి కంఠానికి ఆభరణంగా ఉండే సర్పంతో తనను పోల్చడం సంతోషమేనని అన్నారు.
ప్రజలు దేవుడి స్వరూపమైతే తాను వారి మెడలో సర్పాన్ని అని చెప్పారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రూ. 29 లక్షల కోట్లను వివిధ పథకాల రూపంలో పేదల ఖాతాల్లో జమ చేసినట్టు ప్రధాని మోదీ విరించారు. చెన్నపట్టణ సభలో మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీలో పరస్పరం సహకరించుకునే కాంగ్రెస్-జేడీఎస్ కర్ణాటకలో మాత్రం ప్రత్యర్థులుగా నటిస్తుంటాయని ఆరోపించారు.