Narendra Modi: మైసూరులో మోదీపైకి ఫోన్ విసిరింది బీజేపీ కార్యకర్తే.. ఎందుకంటే..!
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మోదీ
- నిన్న రాత్రి మైసూరులో రోడ్ షో నిర్వహించిన ప్రధాని
- మోదీని చూసిన ఉత్సాహంలోనే ఓ కార్యకర్త వాహనంపైకి
మొబైల్ విసిరినట్టు పోలీసుల వెల్లడి
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ర్యాలీలో అనూహ్య ఘటన ఎదురైంది. నిన్న రాత్రి ప్రత్యేక వాహనంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు కాన్వాయ్ పై పూలు చల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ఇంతలో హఠాత్తుగా ఓ మొబైల్ ఫోన్ ఆయన వాహనంపైకి వచ్చిపడింది. దీన్ని మోదీ కూడా చూడగా.. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ మొబైల్ ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారు. మోదీ లక్ష్యంగా ఆయనపైకి దీన్ని విసిరారని, ర్యాలీలో భద్రతా ఉల్లంఘన జరిగిందని భావించారు. ఎస్పీజీ భద్రత మధ్య ఉండే ప్రధాని వాహనంపైకి సెల్ ఫోన్ రావడంపై సర్వత్రా ఆందోళన రేకెత్తించింది.
అయితే, ఈ మొబైల్ ని విసిరింది ఓ బీజేపీ కార్యకర్త అని తేలింది. మోదీని చూసిన ఉత్సాహంలోనే ఆ వ్యక్తి తన ఫోన్ ని ఆయనపైకి విసిరారని, అంతే తప్ప ఇందులో ఆమెకు మరో దురుద్దేశమేమీ లేదని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) అలోక్ కుమార్ తెలిపారు. ‘ప్రధానమంత్రి వాహనంపై ఫోన్ విసిరిన వ్యక్తికి ఎటువంటి దురుద్దేశం లేదు. ఆయనని చూసిన ఉద్వేగంతోనే ఇలా చేశారు. ఆ ఫోన్ బీజేపీ కార్యకర్తకు చెందినది. మేం ఆ వ్యక్తిని గుర్తించాం. ఎస్పీజీ స్వాధీనం చేసుకున్న ఫోన్ ను తిరిగి ఇచ్చాం. ఈ విషయంలో వాంగ్మూలం నమోదు చేసేందుకు సమన్లు పంపించాం’ అని ఆయన వెల్లడించారు.