eye test: కళ్లను చూసి.. ఈ వ్యాధులను పసిగట్టేయవచ్చు!
- అధిక రక్తపోటుతో కంట్లో రక్తస్రావం కావచ్చు
- కళ్లు నొప్పులు, చూపు మసకబారడం ఎన్నో వ్యాధులకు సంకేతం
- ఏడాదికోసారి కంటి పరీక్షలతో ఎంతో ప్రయోజనం
ఏడాదికోసారి అయినా కళ్లను చెక్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. సమస్య ఏమీ లేదుగా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కంటి చూపులో సమస్యలు కనిపించేంత వరకూ వైద్యుల వద్దకు వెళ్లరు. దీనికి కారణం కంటి ఆరోగ్యంపై ఎక్కువ మందిలో అవగాహన లేకపోవడమే. మన శరీరంలో పలు కీలక వ్యాధుల సమాచారాన్ని మన నేత్రాలు వెల్లడిస్తాయి. ఆరంభ దశలోనే కళ్ల ద్వారా వాటిని గుర్తించొచ్చు. అందుకని క్రమం తప్పకుండా కళ్లను చెక్ చేయించుకోవాలి.
అధిక రక్తపోటు
కళ్లలో రక్తస్రావం అయితే అది రక్తపోటుకు సంకేతమే. దీన్ని సబ్ కంజంక్షనల్ హెమరేజ్ అంటారు. రక్తపోటు అధికంగా ఉండడం వల్ల కంటి ఉపరితలంపై ఉన్న సూక్ష్మ రక్త నాణాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. దగ్గు, చీదే క్రమంలో ఒత్తిడికీ ఇవి చిట్లే అవకాశం ఉంటుంది. అలాగే, తల లేదా కళ్లకు గాయాల సమయంలోనూ ఇలా జరగొచ్చు. కళ్లను బలంగా నలపడం, కాంటాక్టు లెన్సులను ఎక్కువ గంటల పాటు పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి పరిణామం ఎదురుకావచ్చు. అధిక రక్తపోటును సకాలంలో నియంత్రించడంలో విఫలమైతే అది హైపర్ టెన్సివ్ రెటినోపతీకి దారితీస్తుంది. దీనివల్ల కంటి చూపు శాశ్వతంగా పోవచ్చు.
మధుమేహం
మధుమేహం కళ్లకూ హాని చేస్తుంది. త్వరలో మధుమేహం వచ్చే అవకాశాలను కంటి వైద్యులు చెప్పగలరు. మధుమేహం వల్ల కంటిలో కదులుతున్న నల్లటి చుక్కలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కంటి చూపు మసకగా మారుతుంది. రంగులను గుర్తించడం కష్టంగా మారుతుంది. మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే కంటి చూపునకు పెద్ద నష్టం వాటిల్లుతుంది.
గుండె జబ్బులు
కంటి స్ట్రోక్ ల గురించి విని ఉండకపోవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో యాంటీరియర్ ఇస్మెక్ ఆప్టిక్ న్యూరోపతీ అంటారు. కంటిలోని ఆప్టిక్ నెర్వ్ కు రక్త సరఫరా సరిగ్గా జరగనప్పుడు ఇది తలెత్తుతుంది. కంటిలో నొప్పి, చూపులో మసక కనిపిస్తాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వారిలో కంటిలో ఓ సంకేతం కనిపిస్తుంది. కళ్లు పొడిబారిపోతాయి. నిజానికి నేటి జీవనశైలిలో కళ్లు పొడిబారిపోవడం సాధారణం. ఎక్కువ సేపు కళ్లార్పకుండా చూసే వారిలోనూ ఈ సమస్య ఏర్పడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను సకాలంలో చికిత్స చేయకపోతే, కార్నియా, కంటి చూపు విషయంలో రాజీపడాల్సి వస్తుంది.
థైరాయిడ్
థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో కంటి చూపులో మసక వస్తుంది. అంతేకాదు ఒకటే వస్తువు రెండుగా కనిపిస్తాయి. ప్రకాశవంతమైన వెలుగును చూడలేరు.
కేన్సర్
కనురెప్పలకూ కేన్సర్ వస్తుంది. కనురెప్పల మీద మచ్చను గుర్తిస్తే కంటి వైద్యులకు తెలియజేయాలి.
అధిక కొలెస్ట్రాల్
కార్నియా చుట్టూ ఓ వలయం మాదిరి ఉంటే అది కొలెస్ట్రాల్ సంకేతం కావచ్చు.
మల్టిపుల్ స్కెలరోసిస్
కళ్లను కదిపినప్పుడు నొప్పి బాధిస్తుంటే, చూపు మసకగా ఉంటే అది మల్టిపుల్ స్కెలరోసిస్ కావచ్చు.
లైంగిక సుఖవ్యాధులు
లైంగిక సుఖ వ్యాధులు అయిన గనేరియా వంటి వ్యాధుల్లో కంట్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. కార్నియా దెబ్బతినొచ్చు.
విటమిన్ల లోపం
విటమిన్ ఏ, బీ12, విటమిన్ ఈ లోపం ఉంటే కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకని క్రమం తప్పకుండా కంటి చెకప్ అవసరం. కళ్లు పొడిబారడం, కార్నియాపై మచ్చలు, కళ్లు మండడం అనేవి విటమిన్ల లోపం వల్ల కావచ్చు.