Shankar narayana: పెనుకొండ ఎమ్మెల్యే వాహనంపై చెప్పులతో దాడి
- సత్యసాయి జిల్లా రేణుక నగర్లో శంకరనారాయణకు చేదు అనుభవం
- గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న స్థానికులు.. వాహనం ముందు బైఠాయింపు
- ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వకుండా చేశారని ఆరోపణ
- వెనుదిరిగిన ఎమ్మెల్యే.. చెప్పులు విసిరిన కొందరు వ్యక్తులు
మాజీ మంత్రి, పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకరనారాయణకు నిరసన సెగ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం ఈదలబలాపురం పరిధిలోని రేణుక నగర్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కోసం వెళ్లిన శంకరనారాయణను స్థానికులు అడ్డుకున్నారు.
రేణుక నగర్లో ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వకుండా చేశారని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా అభివృద్ధికి అడ్డంకిగా మారారని ఆరోపించారు. శంకరనారాయణ తమ గ్రామంలోకి రాకుండా ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా గ్రామస్థులు పట్టు విడవలేదు. దీంతో శంకర్ నారాయణ వెనుదిరిగారు. ఈ క్రమంలో శంకర్ నారాయణ వాహనంపై కొందరు చెప్పులు విసిరారు.
శంకరనారాయణను సొంత పార్టీకే చెందిన నాగభూషణ రెడ్డి ఆధ్వర్యంలోనే గ్రామస్థులు అడ్డుకోవడం గమనార్హం. ఈదలబలాపురం గ్రామంలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని నాగభూషణ్ రెడ్డి ఆరోపించారు. ఐదు నెలలుగా గ్రామంలో రేషన్ సరుకులు ఇవ్వలేదని చెప్పారు. గ్రామస్థులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మీద అభిమానంతో ఆయన్ను వదిలిపెట్టామని, లేకుంటే శంకరనారాయణను బట్టలూడదీసి కొట్టేవాళ్లమని హెచ్చరించారు.