AR Rahman: ఏఆర్ రెహమాన్ కచేరీని అడ్డుకున్న పూణే పోలీసులు... ఎందుకంటే...!
- ఆదివారం రాత్రి పూణేలో రెహమాన్ కచేరీ
- స్థానిక రాజా బహదూర్ మిల్స్ ఏర్పాటు చేసిన కచేరీ
- రాత్రి 10 దాటిన తర్వాత కూడా పాడుతూనే ఉన్న రెహమాన్
- రాత్రి 10 గంటల వరకే అనుమతి అని రెహమాన్ కు వివరించిన పోలీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పూణేలో ఆదివారం రాత్రి సంగీత కచేరీ నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్న విషయం వెల్లడైంది.
పూణే నగరంలోని రాజా బహదూర్ మిల్స్ లో మ్యూజిక్ మ్యాస్ట్రో కచేరీ ఏర్పాటు చేశారు. ఈ కచేరీలో ఏఆర్ రెహమాన్ చివరి పాటను పాడుతుండగా పోలీసులు ఎంటరయ్యారు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటిందని, పూణేలో రాత్రి 10 గంటల వరకే కచేరీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని రెహమాన్ కు వివరించారు. కచేరీని అంతటితో ముగించాలని స్పష్టం చేశారు.
దీనిపై పూణే జోన్-2 డీసీపీ స్మర్తానా పాటిల్ వివరణ ఇచ్చారు. నిర్దేశిత సమయం దాటిపోయిందన్న విషయాన్ని గుర్తించకుండా రెహమాన్ పాడుతూనే ఉన్నారని, దాంతో వేదిక వద్ద ఉన్న పోలీసులు కచేరీని ఆపేయాలని ఆయనకు సూచించారని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా రెహమాన్ కు వివరించడం జరిగిందని, దాంతో ఆయన పాడడం ఆపేశారని డీసీపీ వెల్లడించారు.