RCB: తక్కువ స్కోరే అనుకుంటే తాట తీశారు!

RCB beat LSG in low score thriller

  • ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్
  • లక్నో అటల్ బిహారీ స్టేడియం వేదికగా రసవత్తరపోరు
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు
  • లక్ష్యఛేదనలో లక్నో 108 పరుగులకు ఆలౌట్

ఇప్పటిదాకా భారీ స్కోర్లతో ఉర్రూతలూగించిన ఐపీఎల్ టోర్నీలో ఓ స్వల్ప స్కోర్ల మ్యాచ్ మాంచి వినోదం అందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో ఇరుజట్ల బ్యాటర్లు పరుగుల కోసం ఆపసోపాలు పడ్డారు. బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. పిచ్ బౌలింగ్ కు సహకరించడమే అందుకు కారణం. 

అయితే, మెరుగైన బౌలింగ్ కు తోడు, అద్భుతమైన ఫీల్డింగ్ కనబర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టే ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ పై 18 పరుగుల తేడాతో నెగ్గింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ కు ఏమాత్రం కలిసిరాని పిచ్ పై 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. 

తక్కువ స్కోరే కదా... సునాయాసంగా ఛేజింగ్ చేయొచ్చని భావించిన లక్నో సూపర్ జెయింట్స్ కు దిమ్మదిరిగిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఓవైపు బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, వారికి తోడు ఫీల్డర్లు పాదరసంలా కదలడంతో లక్నో ఉక్కిరిబిక్కిరైంది. ఇద్దరు బ్యాట్స్ మన్లను రనౌట్ చేయడం ద్వారా తమ ఫీల్డింగ్ పవర్ ఏంటో బెంగళూరు జట్టు చాటిచెప్పింది. 

ఆఖర్లో అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ (13) కాసేపు బెంగళూరు జట్టును ప్రతిఘటించారు. అయితే ఆ జోడీని హేజెల్ వుడ్ ఓ బ్యూటిఫుల్ డెలివరీతో అవుట్ చేశాడు. ఇక గాయంతో బాధపడుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ పదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. గాయం తీవ్రత కారణంగా సింగిల్స్ తీసేందుకు పరిగెత్తలేకపోయాడు. దాంతో అమిత్ మిశ్రానే చివరి ఓవర్ ఆడాడు. 

ఆ ఓవర్ హర్షల్ పటేల్ విసరగా, ఓ భారీ షాట్ కు యత్నించిన మిశ్రా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ కు 19.5 ఓవర్లలో తెరపడింది. మిశ్రా 19 పరుగులు చేశాడు. అంతకుముందు, లక్నో జట్టులో కృష్ణప్ప గౌతమ్ 23, స్టొయినిస్ 13 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హేజెల్ వుడ్ 2, కర్ణ్ శర్మ 2, సిరాజ్ 1, మ్యాక్స్ వెల్ 1, హసరంగ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.

కాగా, ఇటీవల లక్నో జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి ఆర్సీబీ ఈ మ్యాచ్ తో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అప్పుడు లక్నో జట్టు గెలిచినప్పుడు ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ కాస్త ఆవేశం ప్రదర్శించాడు. నేటి మ్యాచ్ లో ఆర్సీబీ గెలవగానే, కోహ్లీ నేరుగా వెళ్లి గంభీర్ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇరుజట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వచ్చి ఇద్దరినీ విడదీశారు.

  • Loading...

More Telugu News