Agent Movie: ఏజెంట్ ఫెయిల్‌కు బాధ్యత మాదే.. క్షమించండి: నిర్మాత అనిల్ సుంకర

Producer Anil Sunkara take the entire blame for Agent Movie
  • ఏప్రిల్ 28న విడుదలైన ఏజెంట్ సినిమా
  • తొలి షో నుంచే ఫ్లాప్ టాక్
  • స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకముందే సినిమాను ప్రారంభించి తప్పు చేశామన్న నిర్మాత
  • సినిమా ఫ్లాప్‌కు సాకులు చెప్పాలనుకోవడం లేదని వ్యాఖ్య
  • కురుస్తున్న ప్రశంసలు
గత నెల 28న విడుదలైన అఖిల్ అక్కినేని సినిమా ‘ఏజెంట్’ బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కించారు. మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా అభిమానులను దారుణంగా నిరాశ పరచడంతో అనిల్ సుంకర తాజాగా స్పందించారు. 

సినిమా పరాజయానికి క్షమాపణలు తెలిపారు. ఏజెంట్ ఫ్లాప్ విషయంలో పూర్తి బాధ్యత తమదేనని ట్వీట్ చేశారు. అదో పెద్ద టాస్క్ అని తెలిసినా సాధించగలమన్న నమ్మకంతో సినిమా చేస్తే, అది ఫెయిల్ అయిందన్నారు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధం కాకముందే సినిమాను ప్రారంభించి తప్పు చేశామన్నారు. దీనికి తోడు షూటింగ్ సమయంలో కొవిడ్ సహా పలు ఇతర సమస్యలు కూడా చుట్టుముట్టాయని పేర్కొన్నారు. అయితే, సినిమా ఫలితం విషయంలో సాకులు చెప్పాలనుకోవడం లేదని, ఈ ఖరీదైన తప్పిదాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని, ఈ లోటును తర్వాత ప్రాజెక్టులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రేక్షకులు తమపై ఎంతో నమ్మకం పెట్టకున్నారని, దానిని వమ్ము చేసినందుకు క్షమించాలని వేడుకున్నారు. అనిల్ సుంకర చేసిన ఈ ట్వీట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా పరాజయాన్ని తనపై వేసుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ప్రశంసిస్తున్నారు.
Agent Movie
Akhil Akkineni
Anil Sunkara
Tollywood

More Telugu News