Bihar: చనిపోయాడనుకున్న వ్యక్తి నుంచి బీహార్ సీఎంకు లేఖ!
- ప్రేమించిన అమ్మాయితో ఇంట్లోంచి పారిపోయానని లేఖలో వివరణ
- పెళ్లి చేసుకుని యూపీలో కాపురం పెట్టినట్లు వెల్లడి
- కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు
తప్పిపోయాడని ఫిర్యాదు చేస్తే పోలీసులు చనిపోయాడన్నారు.. ఓ డెడ్ బాడీని చూపించగా అది మావాడిదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆరు నెలల తర్వాత సదరు చనిపోయిన వ్యక్తి పేరుతో నేరుగా ముఖ్యమంత్రికే ఓ లేఖ వచ్చింది. బీహార్ లో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు..
బీహార్ లోని డియోరియా అనే చిన్న గ్రామంలో సోను కుమార్ శ్రీవాస్తవ కుటుంబం నివసిస్తోంది. ఆరు నెలల క్రితం ఓ రోజు బయటకు వెళ్లిన శ్రీవాస్తవ తిరిగి రాలేదు. ఒకటి రెండు రోజులు వెతికిన తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. గ్రామానికి దగ్గర్లో ఓ గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో శ్రీవాస్తవ కుటుంబానికి చూపించారు. అది తమ అబ్బాయిదేనని శ్రీవాస్తవ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. దీంతో పోస్టుమార్టం చేసి బాడీని శ్రీవాస్తవ కుటుంబానికి పోలీసులు అప్పగించారు. కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసి దర్యాఫ్తు మొదలుపెట్టారు.
తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో పాటు డీజీపీకి, డియోరియా విలేజ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోకు శ్రీవాస్తవ పేరుతో ఓ లేఖ వచ్చింది. ఆ లేఖ చదివి పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను చనిపోలేదని, ప్రేమించిన అమ్మాయితో పారిపోయి వచ్చానని శ్రీవాస్తవ ఆ లేఖలో పేర్కొన్నాడు. పెళ్లి చేసుకుని ఉత్తరప్రదేశ్ లో కాపురం పెట్టానని వివరించాడు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు శ్రీవాస్తవ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.