Vande Bharat: కేరళలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
- కాసర్ గోడ్ నుంచి తిరువనంతపురంకు వెళ్తున్న రైలుపై దాడి
- ఒక కోచ్ అద్దాలు ధ్వంసం
- గత నెల 25న రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు పలు చోట్ల వందేభారత్ రైళ్లపై దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రయాణిస్తున్న రైలుపై కూడా అల్లరిమూకలు దాడి చేశాయి. తాజాగా కేరళలో కూడా వందేభారత్ రైలుపై దాడి జరిగింది.
కాసర్ గోడ్ నుంచి తిరువనంతపురంకు రైలు వెళ్తుండగా తిరునవాయ - తిరూర్ మధ్య రైలుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎవరూ గాయపడనప్పటికీ... ఒక కోచ్ కు చెందిన అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి అనంతరం సదరన్ రైల్వే అధికారులు స్పందిస్తూ... రైలుకు మరింత భద్రతను కల్పిస్తామని చెప్పారు.
గత నెల 25న ఈ వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ లో జెండాను ఊపి రైలును ప్రారంభించారు.