Ukraine: కాళికామాత చిత్రాన్ని వక్రీకరిస్తూ ట్వీట్.. క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్
- తనకు తోచినట్టు చిత్రీకరించిన ఉక్రెయిన్ రక్షణ శాఖ
- హిందువుల మనోభావాలను గాయపరిచేలా చర్య
- దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు
- తప్పును గ్రహించి విచారం వ్యక్తం చేసిన ఉక్రెయిన్
కాళికామాత భారత్ లో హిందువులకు ఆరాధ్య దైవం. ఉక్రెయిన్ రక్షణ శాఖ ఈ విషయాన్ని విస్మరించింది. పరమత దేవుళ్లను కించపరచకూడదన్న కనీస ఇంగితం కూడా లేకుండా వ్యవహరించింది. కాళికామాత చిత్రాన్ని హిందువులకు ఏ మాత్రం ఆమోదనీయం కాని రీతిలో చిత్రీకరించింది. అమ్మవారి నడుము నుంచి పై భాగం మేఘాలపైన కనిపించేలా, మేఘం కింద కాళ్లు ఉండేలా.. మధ్యలో మేఘం గౌను మాదిరిగా రూపొందించి ట్వీట్ చేసింది. దీన్ని ఇప్పుడు డిలీట్ చేశారు.
ఉక్రెయిన్ ప్రభుత్వం చర్యపై భారత్ లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారత్ సాయం తీసుకుని, భారత్ లో ఎక్కువ మంది ఆరాధించే కాళికామాతను ఉక్రెయిన్ అవమానించిందని చాలా మంది మండిపడుతున్నారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎమినే జపరోవా భారత్ లో ఇటీవలే పర్యటించి వెళ్లడం తెలిసిందే. అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. సదరు చిత్రం హిందువుల మనోభావాలను గాయపరచడమేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సీనియర్ అడ్వైజర్ కాంచన్ గుప్తా సైతం పేర్కొన్నారు.
దీంతో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎమినే జపరోవా స్పందించారు. ‘‘రక్షణ శాఖ హిందూ దేవత అయిన కాళీని వక్రకీరించినందుకు విచారిస్తున్నాం. ఉక్రెయిన్, ఉక్రెయిన్ ప్రజలు వినూత్నమైన భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. భారత మద్దతుకు అభినందనలు. వక్రీకరించిన చిత్రం ఇప్పటికే డిలీట్ చేశాం. పరస్పర గౌరవం, స్నేహ భావంతో రెండు దేశాలు మరింత సహకారం అందించుకోవాలి’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.