brij bhushan: డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ దారుణ వ్యాఖ్యలు
- ఆరోపణలను ఖండించే క్రమంలో మరో వివాదంలో చిక్కుకున్న బ్రిజ్ భూషణ్
- వెయ్యి మందిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సహనం కోల్పోయిన బీజేపీ ఎంపీ
- ‘నేనేమైనా శారీరక పటుత్వాన్ని పెంచే లేహ్యంతో చేసిన రోటీలు తిన్నానా?’ అంటూ ప్రశ్న
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే ప్రయత్నంలో మరో వివాదంలో చిక్కుకున్నారు. వెయ్యి మందిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సహనం కోల్పోయి.. ‘నేనేమైనా శారీరక పటుత్వాన్ని పెంచే లేహ్యంతో చేసిన రోటీలు తిన్నానా?’ అని మండిపడ్డారు.
ఫెడరేషన్‌లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఎదుర్కొంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ హిందీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో బ్రిజ్ భూషణ్ సహనం కోల్పోయారు.
‘‘తొలుత 100 మంది పిల్లలపై నేను లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఆరోపించారు. ఇప్పుడేమో వెయ్యి మంది అమ్మాయిలను లైంగికంగా వేధించానని అంటున్నారు. నేనేమైనా శిలాజిత్‌తో (శారీరక పటుత్వాన్ని పెంచే లేహ్యం) చేసిన రోటీలు తిన్నానా ఏమిటి?’’ అని ప్రశ్నించారు.
రెజ్లర్ల నిరసనలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని, వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాల్లేవని చెప్పారు. తనను ఉరితీసినా సరే జాతీయ పోటీలు, ఆటగాళ్ల క్యాంపులు నిలిచిపోవడానికి వీల్లేదని అన్నారు. రెజ్లర్ల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్నారు.
మరోవైపు రెజ్లర్ బజరంగ్ పూనియాపై బ్రిజ్ భూషణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఓ అమ్మాయిని ఏర్పాటు చేయాలని బజరంగ్ కొందరిని అడిగినట్లు ఆరోపించారు. ‘‘నాపై ఆరోపణలు చేసేందుకు ఒక అమ్మాయిని ఏర్పాటు చేయమని బజరంగ్ పునియా అడుగుతున్న ఆడియోను నేను విచారణ కమిటీకి ఇచ్చాను’’ అని చెప్పారు.