aap: లిక్కర్ స్కాం కేసు చార్జిషీటులో ఆమ్ ఆద్మీ ఎంపీ పేరు!
- ఛార్జిషీటులో ఎంపీ రాఘవ్ చద్దా పేరును ప్రస్తావించిన ఈడీ
- మనీశ్ సిసోడియా ఇంట్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎంపీ
- భేటీ గురించి దర్యాఫ్తు సంస్థలకు తెలిపిన సిసోడియా మాజీ కార్యదర్శి
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలను దర్యాఫ్తు సంస్థ ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఎంపీ రాఘవ్ చద్దా పేరు దర్యాఫ్తు సంస్థ అనుబంధ ఛార్జిషీటులో చేర్చింది. కానీ నిందితుడిగా చేర్చలేదు. ఈడీ ఛార్జిషీట్లలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పార్టీలోని ఇతర నేతలు సంజయ్, రాఘవ్ పేర్లు కూడా ఉన్నాయి. కొత్త మద్యం విధానంపై మాజీ సీఎం మనీశ్ సిసోడియా నిర్వహించిన సమావేశంలో రాఘవ్ చద్దా కూడా పాల్గొనడంతో ఈ ఛార్జిషీటులో ఆయన పేరును సాక్షిగా ప్రస్తావించారు.
ఈ సమావేశం గురించి మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్... దర్యాఫ్తు సంస్థలకు చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మనీష్ సిసోడియా నివాసంలో జరిగిన భేటీలో చద్దాతో పాటు పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్, విజయ్ నాయర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు అరవింద్ దర్యాఫ్తు సంస్థలకు తెలిపారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంపీ రాఘవ్ పేరును ఈడీ అనుబంధ ఛార్జిషీట్ లో ప్రస్తావించింది.
ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ సంస్థలు దర్యాఫ్తు చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు.