Rajinikanth: ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోను: చంద్రబాబుకు తెలిపిన రజనీకాంత్
- విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ
- ముఖ్య అతిథిగా వచ్చిన రజనీకాంత్
- ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ
- చంద్రబాబుపై పొగడ్తలు
- రజనీకాంత్ పై మండిపడుతున్న వైసీపీ వర్గాలు
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభకు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడిన రజనీకాంత్, చంద్రబాబు విజన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అప్పటి నుంచి ఆయనను వైసీపీ మంత్రులు, వైసీపీ మద్దతుదారులు టార్గెట్ చేయడం తెలిసిందే.
సిల్క్ స్మిత ఆత్మహత్య, ఆమె చివరి లేఖను రజనీకాంత్ కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ పై విమర్శలను టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు, రజనీకాంత్ మధ్య ఫోన్ సంభాషణ చోటుచేసుకుంది. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దని చంద్రబాబు... రజనీకాంత్ ను కోరారు. అందుకు రజనీకాంత్ బదులిస్తూ, ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోనని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి సభలో పుస్తకావిష్కరణ చేయడం తన అదృష్టం అని తెలిపారు. ఆ సభలో ఉన్న విషయాలే చెప్పానని, తన అభిప్రాయం మారదని వివరించారు. తనపై వస్తున్న విమర్శల పట్ల సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు చెప్పానని రజనీ వెల్లడించారు.