Watchman Ranganna: వివేకా హత్యకేసులో సాక్షి వాచ్ మన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత
- రంగన్నకు ఆస్థమా ఉందన్న కుటుంబ సభ్యులు
- పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలింపు
- వివేకా హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చిన రంగన్న
- ఎర్ర గంగిరెడ్డి పేరును తెరపైకి తెచ్చిన రంగన్న వాంగ్మూలం!
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాచ్ మన్ రంగన్న ఆస్థమాతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు.
2019లో వివేకా హత్య జరగ్గా... వాచ్ మన్ రంగన్న రెండేళ్ల కిందట జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. రంగన్నను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. వాచ్ మన్ రంగన్న తన వాంగ్మూలంలో వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పేరును ప్రస్తావించాడు. హత్య విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించాడని రంగన్న వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
అయితే, రంగన్న ఎవరో తనకు తెలియదని, రంగన్న వాంగ్మూలంలో నిజాలు లేవని ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో ఖండించారు. కానీ తర్వాత కాలంలో ఎర్ర గంగిరెడ్డి ఈ కేసులో ఏ-1 నిందితుడవడం గమనార్హం. దస్తగిరి అప్రూవర్ గా మారడంతో రంగన్న వాంగ్మూలానికి బలం చేకూరినట్టయింది.