Gautam Adani: అదానీ విల్మర్ లాభాలు రూ.234 కోట్ల నుండి రూ.94 కోట్లకు డౌన్
- ఏడాది ప్రాతిపదికన 60 శాతం తగ్గిన అదానీ విల్మర్ లాభాలు
- ఆదాయంలో కూడా 7 శాతం క్షీణత
- FY23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.582 కోట్ల ప్రాఫిట్ నమోదు
మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోని చివరి... నాలుగో త్రైమాసికంలో అదానీ విల్మర్ లాభం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 60 శాతం తగ్గి రూ.94 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 7 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.234 కోట్లుగా నమోదయింది. ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.13,872.6గా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.14,917.2 కోట్లుగా నమోదయింది. అంటే ఏడు శాతం క్షీణించింది.
2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ.58,185 కోట్లు కాగా, లాభం రూ.582 కోట్లుగా నమోదయింది. FY23లో ఈ కంపెనీ సేల్స్ 5 మిలియన్ మెట్రిక్ టన్నులను క్రాస్ చేసింది. వీట్, రైస్.. ఈ రెండింటి వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లు దాటింది. ఎడిబుల్ ఆయిల్ రంగంలో 8 శాతం వృద్ధి నమోదయింది. అదానీ విల్మర్ అన్ని కేటగిరీల వ్యాల్యూమ్ పెరుగుదల 3 శాతంగా నమోదయింది.
FY23లో ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ రెవెన్యూ రూ.4000 కోట్లుగా నమోదయిందని, ఏడాది ప్రాతిపదికన 39 శాతం వృద్ధిని నమోదు చేసిందని, వ్యాల్యూమ్ పరంగా 55 శాతం పెరిగిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎడిబుల్ ఆయిల్స్ బ్రాండెడ్ సేల్స్ వ్యాల్యూమ్ 4 శాతం పెరిగినట్లు వెల్లడించింది. కాగా, హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.