KCR: కొందరు మాట్లాడతారు.. పనిచేయరు: కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సెటైర్లు
- కేసీఆర్-తమిళిసై మధ్య కొనసాగుతున్న విభేదాలు
- దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని సెటైర్లు
- సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామన్న ప్రభుత్వం
- తమకు అందలేదన్న రాజ్‌భవన్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య మొదలైన విభేదాలు ఇంకా పెరుగుతున్నాయే తప్ప సమసిపోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం వారి మధ్య విభేదాలను మరోమారు ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళిసై మాట్లాడుతూ.. కేసీఆర్‌కు పరోక్షంగా చురకలంటించారు.
కొందరు మాట్లాడతారు కానీ పనిచేయరని ఎద్దేవా చేశారు. దేశాధినేతలనైనా ఇట్టే కలవొచ్చని, కానీ ఈ రాష్ట్ర చీఫ్‌ను మాత్రం కలవలేమని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలినైన తనకు సచివాలయ ప్రారంభోత్సవానికి పిలుపే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్, రాజ్‌భవన్ దూరంగా ఉంటున్నాయన్నారు. అభివృద్ధి అంటే కుటుంబ అభివృద్ధి కాదని, రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలని అన్నారు. మనమంతా ఉన్నది ప్రజల కోసమేనని, ఆ దిశగా పనిచేయాలని సూచించారు.
కాగా, నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించినా ఆమె రాలేదని ప్రభుత్వం చేసిన ప్రకటనపై రాజభవన్ స్పందించింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆహ్వానమూ అందలేదని స్పష్టం చేసింది. ఆహ్వానం లేనందువల్లే గవర్నర్ హాజరు కాలేదని పేర్కొంది.