himalaya: హిమాలయన్ వయాగ్రా కోసం వెళ్లి ఐదుగురి గల్లంతు
- హిమాలయ ప్రాంతాల్లో దొరికే అత్యంత విలువైన మూలిక
- యార్సగుంబా కోసం వెళ్లిన నలుగురు మహిళలు, ఒక పురుషుడు గల్లంతు
- కొంతమందిని కాపాడిన భద్రతా సిబ్బంది
హిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలికను తీసుకు వచ్చేందుకు వెళ్లిన కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.
'మిస్ అయిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వాతావరణ పరిస్థితి కూడా బాగా లేదు' అని డిప్యూటీ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ ధామి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బోలిన్లోని బయాన్స్ విలేజ్ కౌన్సిల్- 01 వద్ద భారీ హిమపాతం సంభవించిందని ఓ అధికారి తెలిపారు.
యార్సగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచు తుపానులో గల్లంతయ్యారని, వెంటనే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది కొందరిని కాపాడిందని, ఐదుగురి ఆచూకీ దొరకలేదని చెప్పారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
యార్సగుంబా హిమాలయాల్లో లభించే విలువైన మూలిక. అరుదుగా లభించే ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఈ మూలికల్లో ఉంటుందని భావిస్తున్నారు. అందుకే దీనిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు.