Jammu And Kashmir: రెండు నెలల క్రితం ఉగ్రవాదంలో చేరిన ఇద్దరు యువకులు.. ఎన్‌కౌంటర్‌లో హతం
- బారాముల్లా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘటన
- హతమైన ఇద్దరూ స్థానిక ఉగ్రవాదులుగా గుర్తింపు
- ఈ ఏడాది మార్చిలోనే లష్కరేలో చేరిన వైనం
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఏకే 47 రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. హతమైన ఉగ్రవాదులను షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మజీద్ నజర్, హనన్ అహ్మద్ షేగా గుర్తించారు.
వీరిద్దరూ లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు. వారు ఈ ఏడాది మార్చిలోనే ఉగ్రవాదంలో చేరినట్టు పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు. బారాముల్లా జిల్లాలోని వనీగామ్ పీయన్ క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు తిప్పికొట్టాయి.