Sarath Babu: శరత్ బాబుకు నివాళి తెలిపి, నాలుక కరుచుకున్న కమల్ హాసన్
- ప్రియమైన పెద్దన్నయ్య, స్నేహితుడు, శ్రేయోభిలాషి అంటూ ట్వీట్
- నీ సినిమాలతో ఎప్పటికీ మాలో జీవించే ఉంటావన్న కమల్
- ట్వీట్ చేసి, అనంతరం డిలీట్ చేసిన నటుడు
ప్రముఖ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఏఐజీ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన మరణించారంటూ కొన్ని సంస్థలు తొందరపాటుతో వార్తలను ప్రచురిస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం ఇలాంటి వార్తలు ఎక్కువగా ప్రసారం అయ్యాయి. వీటితో పొరపాటు పడిన కమల్ హాసన్ వెంటనే శరత్ బాబుకు నివాళి అర్పిస్తూ ట్విట్ వదిలేశారు. తర్వాత జరిగిన తప్పును తెలుసుకుని ఆ ట్వీట్ ను తొలగించడం చర్చకు దారితీసింది.
ఒక ప్రముఖ నటుడి ఆరోగ్యం విషమించి చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఇలాంటి తొందరపాటు చర్యలు నవ్వుల పాలు చేస్తాయని రుజువైంది. కమల్ హాసన్ అనే కాదు, మరికొందరు సైతం ఇలానే చేశారు. అనంతరం శరత్ బాబు మరణ వార్తలను ఆమె సోదరి ఖండించారు. శరత్ బాబుపై సోషల్ మీడియాలో తప్పుగా వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన కొంచెం కోలుకున్నారని ఆయన సోదరి ప్రకటించడం గమనార్హం. ఏఐజీ ఆస్పత్రి సైతం ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, అయినా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
‘‘నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్ బాబు నాకు స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి, శ్రేయోభిలాషి. నీవు నటించిన ఎన్నో సినిమాలు నిన్ను ఎప్పటికీ మా మధ్య చిరంజీవిగా నిలిపి ఉంచుతాయి. మన కథలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి.. ఆయన జ్ఞాపకాలు కూడా’’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తర్వాత దీన్ని తొలగించారు.