chikoti praveen: రాజకీయాల్లోకి వస్తున్నాననే ప్రచారం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్
- థాయ్ లాండ్ లో పోకర్ ఆర్గనైజర్‌ను తాను కాదని చికోటి పునరుద్ఘాటన
- ఆ దేశంలో కఠిన చట్టాలు ఉంటాయి.. తప్పించుకోలేమని వ్యాఖ్య
- తనను తొక్కేద్దామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
థాయ్ లాండ్ లో పోకర్ టోర్నమెంట్ కు తాను ఆహ్వానితుడిగా వెళ్లానని, దానిని తాను ఆర్గనైజ్ చేయలేదని చికోటి ప్రవీణ్ మరోసారి స్పష్టం చేశాడు. ఈ మేరకు తన అరెస్ట్, తనపై జరుగుతున్న ప్రచారంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. పోలీసులు దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి తాను రూ.50 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ కఠిన చట్టాలు ఉంటాయని తెలిపారు.
ఈ పోకర్ ఈవెంట్ ను తాను ఆర్గనైజ్ చేయలేదని, దేవ్, సీతలు ఆర్గనైజ్ చేశారని, ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పానని తెలిపారు. ఈ ఈవెంట్ కు అనుమతి ఉందని ఆర్గనైజర్స్, అనుమతి లేదని పోలీసులు చెప్పారని అన్నారు. ఈవెంట్ ను తాను ఆర్గనైజ్ చేసి ఉంటే ఇంత ఈజీగా బయటకు రానని చెప్పారు. తన పాస్ పోర్టు బ్లాక్ లిస్ట్ లో కూడా లేదని, థాయ్ లాండ్ లో కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. తాను తప్పు చేసి ఉంటే అక్కడి పోలీసులు అంత సులభంగా వదలరని, గ్యాంబ్లింగ్ చేస్తే ఏడేళ్ల వరకు కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. తనను అరెస్ట్ చేసిన రోజు కోర్టుకు సెలవు అని, అలాగే తనకు, తనతో పాటు అరెస్టైన వారికి పెనాల్టీ విధించారని చెప్పారు.
థాయ్ లాండ్ లో తన అరెస్టుపై కుట్రలు చేస్తున్నారని, తనను తొక్కేద్దామని చూస్తున్నారన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నాననే వదంతులతో తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రెండ్రోజులుగా తనపై మరో ప్రచారం సాగుతోందని, థాయ్ లాండ్ లో ఈ కేసు నుండి తప్పించుకోవడానికి తాను రూ.50 లక్షలు ఇచ్చానని అంటున్నారని, కానీ ఉన్నతాధికారి రైడ్ చేశారని, అలాగే అక్కడ డబ్బులు ఇచ్చి తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. చట్టం చాలా కఠినంగా ఉంటుందని, అక్కడి ఈవెంట్ కు చికోటికి (తనకు) ఎలాంటి సంబంధం లేదని అందరు తెలుసుకోవాలని చెప్పారు.