Chandrababu: ఈ నాలుగేళ్లలో ఎప్పుడైనా జగన్ పొలంలో దిగారా?: చంద్రబాబు

Chadrababu visits damaged fields in Eluru district

  • ఏలూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ
  • తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన టీడీపీ అధినేత
  • ఎక్కడ చూసినా ధాన్యం మొలకలొచ్చిందని వెల్లడి
  • ఒక చేతకాని దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఏలూరు జిల్లాకు విచ్చేశారు. ఉంగుటూరు మండలం నాచుగుంటలో అకాల వర్షాలకు తడిసి దెబ్బతిన్న, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. 

పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని రైతులు టీడీపీ అధినేతకు చూపించి ఆవేదన వెలిబుచ్చారు. తమకు చిరిగిన సంచులు ఇచ్చారంటూ వాపోయారు. తమ కష్టాలను ఆయనకు వివరించారు. ట్రాక్టర్ లో అక్కడికి వచ్చిన చంద్రబాబు... ట్రాక్టర్ దిగి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎక్కడ చూసినా ధాన్యం మొలకలొచ్చిందని వెల్లడించారు. 60 శాతానికి పైగా ధాన్యం పొలాల్లో ఉందని తెలిపారు. రైతుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని విచారం వ్యక్తం చేశారు. 

ఒక చేతకాని దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని ఘాటుగా విమర్శించారు. మీకు బాధ్యత లేదా... రైతుల వద్దకు ఎందుకు రారు? అని సీఎంను నిలదీశారు. ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలి? అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఎప్పుడైనా జగన్ పొలంలో దిగారా? అని సూటిగా ప్రశ్నించారు. 

ఓవైపు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎయిర్ పోర్టుకు శంకుస్థాపనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా, గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్లీ చేస్తున్నారు అంటూ విమర్శించారు. 

చెత్త ముఖ్యమంత్రి చెత్త వ్యవస్థలను తీసుకొచ్చాడంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతు భరోసా కేంద్రాలు కాదు... రైతు దగా కేంద్రాలు అని అన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి... భయపడేది లేదు అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News