Talasani: ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరు: మంత్రి తలసాని
- ప్రభుత్వానికి నంది అవార్డులపై ఎవరూ ప్రతిపాదన చేయలేదన్న మంత్రి
- సినిమా పరిశ్రమకు తెలంగాణ సహకరిస్తోందని వెల్లడి
- వచ్చే ఏడాది నుండి ఇస్తామని వ్యాఖ్య
- నంది అవార్డులు ఇవ్వట్లేదన్న పరిశ్రమ వ్యాఖ్యలకు తలసాని స్పందన
తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డుల వివాదంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం స్పందించారు. నంది అవార్డుల విషయమై ప్రభుత్వానికి ఎవరూ ప్రతిపాదన చేయలేదని ఆయన చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచన చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పురస్కారాలు ఇవ్వాలని ఎవరూ అడగలేదని చెప్పారు. అయినా ఎవరు పడితే వారు అడిగితే పురస్కారాలు ఇవ్వరని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇచ్చే ఆసక్తి రెండు ప్రభుత్వాలకు లేదని ఇటీవల సినీ పరిశ్రమ నుండి కొంతమంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సినీ నిర్మాతలు ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్ లు ఇటీవల అవార్డులపై కామెంట్ చేశారు. నంది అవార్డులు ఇవ్వాలనే ఆసక్తి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేదని, ఇదివరకు ప్రభుత్వ అవార్డులకు విలువ ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆదిశేషగిరి రావు ఇటీవల అన్నారు. నంది అవార్డులు ఇచ్చే రోజులు రెండు మూడేళ్లలో వస్తాయని అశ్వనీదత్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ నుండి నంది అవార్డు డిమాండ్ నేపథ్యంలో తలసాని స్పందించారు.