Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు ఇష్యూలో కేటీఆర్ ఎందుకు మొహం చాటేశారు: రేవంత్ రెడ్డి
- కేటీఆర్ కాకుండా, అధికారితో వివరణ ఇప్పించారన్న రేవంత్
- సమాధానం సంతృప్తికరంగా లేదని విమర్శ
- ఓఆర్ఆర్‌పై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్య
- అవసరమైతే కోర్టుకు వెళతామన్న తెలంగాణ పీసీసీ చీఫ్
ఔటర్ రింగ్ రోడ్డు ఇష్యూలో మంత్రి కేటీఆర్ మొహం ఎందుకు చాటేశాడని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మౌనం వెనుక కారణాన్ని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని మరోసారి ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ సమాధానం చెప్పకుండా అధికారితో వివరణ ఇప్పించారని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అధికారి అర్వింద్ వివరణ సంతృప్తికరంగా లేదన్నారు.
ఈ విషయానికి సంబంధించి కాగ్ కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. కేంద్రం ఎలా అయితే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తుందో తెలంగాణ ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోందన్నారు. ఇందుకు ఓఆర్ఆర్ లీజు నిదర్శనమన్నారు.
విశాఖ స్టీల్ ను ప్రయివేటు పరం చేయవద్దని డిమాండ్ చేసిన కేసీఆర్, ఔటర్ ను ఎందుకు ప్రయివేటుకు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఆరువేల ఎకరాల్లో ఉన్న ఔటర్ భూమి వ్యాల్యూ రూ.65 వేల కోట్ల నుండి రూ.1 లక్ష కోట్ల వరకు ఉంటుందన్నారు.
ఓఆర్ఆర్‌పై నివేదిక ఇచ్చిన సంస్థ బ్యాక్ గ్రౌండ్ బాగా లేదన్నారు. ఈ సంస్థ చరిత్ర నేరమయమని, అమెరికాలో విచారణ ఎదుర్కొంటోందన్నారు. ఓ సంస్థను ఎంపిక చేసుకున్నప్పుడు ఆ సంస్థ మూలాలు పరిశీలించాల్సి ఉందన్నారు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా ఎవరైనా టెండర్లను పిలుస్తారా? అని ప్రశ్నించారు.