Indian Railways: పెంపుడు జంతువులకు ఆన్లైన్లో రైలు టిక్కెట్లు!
- రైల్వే శాఖ పరిశీలనలో ప్రతిపాదన
- పెంపుడు జంతువులకు టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీఈలకూ అధికారాలు
- ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఇందుకు అనుగుణంగా మార్పులు చేయనున్న రైల్వే శాఖ
పెంపుడు జంతువులు గల వాళ్లకు ఓ గుడ్ న్యూస్. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పెంపుడు జంతువులతో రైలు ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌లో కూడా పెంపుడు జంతువులను తరలించవచ్చు.
అయితే, ఇదంతా కాస్త కష్టతరంగా మారడంతో పెంపుడు జంతువులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఈ దిశగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మార్పులు చేయాలని రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్‌కు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.