USA: ఉద్యోగులకు పెద్ద పార్టీ.. ఆ తరువాత వారి కొంప ముంచిన సంస్థ!

A cybersecurity company throws a party with branded drinks and then fires 13 per cent of its workforce

  • అమెరికా కంపెనీ బిషప్ ఫాక్స్‌లో అనూహ్యంగా ఉద్యోగుల తొలగింపు
  • తొలుత ఉద్యోగులకు పెద్ద పార్టీ, ఆపై ఊస్టింగ్
  • ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ ఉద్యోగుల ఆవేదన

అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ బిషప్ ఫాక్స్ ఇటీవల అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించింది. తొలుత సంస్థలో ఉద్యోగులందరికీ యాజమాన్యం పెద్ద పార్టీ ఇచ్చింది. సైబర్ సూప్ పేరిట పార్టీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఉద్యోగులకు ఖరీదైన బ్రాండెడ్ మద్యాన్ని ఇచ్చింది. ఆ మరుసటి రోజున 50 మందిని తొలగించబోతున్నట్టు ప్రకటించేసింది. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా సుమారు 13 శాతం. 

తమను ఇలా ఉద్యోగంలోంచి తీసేస్తారని అస్సలు ఊహించలేదని కొందరు సోషల్ మీడియా వేదికగా వాపోయారు. సంస్థ అంతర్గత మార్పుల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక రంగంపై నీలినీడలు కమ్ముకుంటున్న కారణంగానే ఉద్యోగులను తీసేసేందుకు నిర్ణయించినట్టు బిషప్ ఫాక్స్ పేర్కొంది. ప్రస్తుతం సంస్థ వ్యాపారం స్థిరంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, గతంలో సంస్థ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడంతో ప్రస్తుతం తొలగింపులు చేపట్టాల్సి వచ్చిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానించాయి.

USA
  • Loading...

More Telugu News