Pakistan: ఉగ్రవాదంపై పాక్ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే..!
- ఇప్పుడు కొత్తగా పుట్టిన సమస్య కాదన్న బిలావల్ భుట్టో
- టెర్రరిజంపై తమ దేశం కూడా పోరాడుతోందని వెల్లడి
- ఇరుదేశాల మధ్య చర్చలకు ఈ సమస్య అడ్డంకి కాదని వివరణ
- ఆర్టికల్ 370 రద్దు చేస్తేనే భారత్ తో చర్చలకు సిద్ధమని ప్రకటన
ఉగ్రవాదం ఇటీవలే పుట్టుకొచ్చిన సమస్య కాదని, ఏళ్ల తరబడి బాధిస్తూనే ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన పాక్ మంత్రి.. ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్ పాక్ ల మధ్య సంబంధాలు, ఇరు దేశాల మధ్య చర్చలకు ఉగ్రవాద సమస్య అడ్డుకాదని చెప్పారు.
పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని, ఏళ్ల తరబడి పోరాడుతోందని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం తొలగిపోయే వరకూ పాకిస్థాన్ తో చర్చల ప్రసక్తే లేదంటూ భారత్ తేల్చిచెప్పడంపై భుట్టో స్పందించారు. ‘భారత్ చెప్పిందని కాదు.. మేం కూడా బాధితులమే కాబట్టి ఉగ్రవాద నిర్మూలనకు పోరాడుతున్నాం’ అని వివరించారు. అయితే, ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఇరు దేశాలు శాంతి చర్చలు జరపవచ్చని భుట్టో తెలిపారు.
భారతదేశం చెబుతున్న సమస్యలపై పోరాడేందుకు పాక్ సిద్ధంగా ఉందని భుట్టో తెలిపారు. అదే సమయంలో పాక్ అభ్యంతరాలనూ భారతదేశం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించేదాకా భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు పాక్ ముందుకు రాదని భుట్టో స్పష్టం చేశారు.
భారత్ లో ఉగ్రదాడుల విషయంపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ఉగ్రదాడులకు సంబంధించి భారతదేశం చాలా పెద్ద జాబితా చెబుతుంది. కానీ పాకిస్థాన్ లో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉందని, అది సరిగ్గా పనిచేస్తుందని మాత్రం నమ్మదు అని భుట్టో ఆరోపించారు. ముంబై దాడులకు సంబంధించిన కేసు పాకిస్థాన్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని చెప్పారు. విచారణ ముందుకు సాగకపోవడానికి భారతదేశ వైఖరే కారణమని ఆరోపించారు. ఆరోపణలు చేయడమే తప్ప భారత్ ఆధారాలు ఇవ్వలేదని, అందుకే కేసు ఇంకా కొనసాగుతోందని భుట్టో వివరించారు.