army: తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్‌ను మరోసారి నిలిపివేసిన ఆర్మీ
- ధ్రువ్ కూలిన ఘటనలో ఒక టెక్నిషియన్ దుర్మరణం
- చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి
- సోమవారం నుండే పునరుద్ధరించబడిన సేవల నిలిపివేత
భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ టెక్నిషియన్ దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై దర్యాఫ్తు చేపట్టిన ఆర్మీ ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేసింది. ఈ మేరకు మిలిటరీ వర్గాలు శనివారం వెల్లడించాయి.
ఇక ఈ చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి 8వ తేదీన మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు.
అయితే గత సోమవారం నుండే సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా, గురువారం ఓ ధ్రువ్ హెలికాప్టర్ కూలిపోవడం గమనార్హం. సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్ లోని కిస్త్ వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించే ప్రయత్నిస్తుండగా ఈ చాపర్ కూలింది. ఈ ప్రమాదంలో తెలంగాణవాసి పబ్బల్ల అనిల్ మృతి చెందాడు. ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.