CSK: చెపాక్ లో సీఎస్కే కేక
- సొంతగడ్డపై జూలు విదిల్చిన చెన్నై సూపర్ కింగ్స్
- ముంబయి ఇండియన్స్ పై 6 వికెట్ల తేడాతో విక్టరీ
- 140 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఛేదించిన సీఎస్కే
- పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన ధోనీ సేన
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
ఈ మ్యాచ్ లో ధోనీ సేన ఆల్ రౌండ్ షో కనబర్చింది. తొలుత ముంబయిని 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులతో కట్టడి చేసిన సీఎస్కే... అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది.
ఓపెనర్లు డెవాన్ కాన్వే 44, రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులతో రాణించగా... రహానే 21 పరుగులు చేశాడు. అంబటి రాయుడు (12) పెద్దగా ఆకట్టుకోకపోయినా, శివమ్ దూబే (26 నాటౌట్) మూడు సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు. ధోనీ ఆఖర్లో బ్యాటింగ్ వచ్చి ఓ సింగిల్ తీయడంతో సీఎస్కే గెలుపుతీరాలకు చేరింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 2, ట్రిస్టాన్ స్టబ్స్ 1, ఆకాశ్ మధ్వాల్ 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సీఎస్కే ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. అటు, ముంబయి ఇండియన్స్ 10 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు నమోదు చేసింది.
టాస్ గెలిచిన ఆర్సీబీ
ఇక, నేడు డబుల్ హెడర్ లో భాగంగా జరిగే మరో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.