Sharad Pawar: రాజీనామా వెనక్కి తీసుకోవడంపై శరద్ పవార్ ఏమన్నారంటే...!

Sharad Pawar On What Led To Rumours About Ajit Pawar

  • పార్టీ కేడర్ నుండి ఇంత ప్రతిస్పందన వస్తుందని ఊహించలేదన్న ఎన్సీపీ చీఫ్
  • ముందుగా చెబితే ఒప్పుకోరనే, రాజీనామా చేశా... కానీ కన్విన్స్ చేయలేకపోయానని వ్యాఖ్య
  • మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా వెనక్కి తీసుకున్నానన్న పవార్
  • అజిత్ పవార్ ఫలితాల పైనే దృష్టి సారిస్తాడని వ్యాఖ్య
  • పార్టీని ఎవరూ వీడరని, విచ్ఛిన్నం కాదన్న శరద్ పవార్

తన రాజీనామా విషయంలో పార్టీ కేడర్ నుండి ఇంత ప్రతిస్పందన వస్తుందని తాను ఊహించలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 

తాజాగా ఆయన తన రాజీనామా ఉపసంహరణపై మాట్లాడారు. తన రాజీనామాను అంగీకరించరని తెలిసే, పార్టీ వర్గాలను ముందుగా సంప్రదించలేదన్నారు. రాజీనామా తర్వాత వారిని ఒప్పిస్తానని భావించానని, కానీ సాధ్యం కాలేదన్నారు. ఈ సమయంలో వారి మనోభావాలను గౌరవిస్తూ రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.

56 ఏళ్లుగా ఎంపీగా, ఎమ్మెల్యేగా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని, ఎంపీగా తనకు మరో మూడేళ్ల పదవీ కాలం ఉందన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర, దేశస్థాయిలో పార్టీని నడిపించే కొత్త రక్తం కోసం చూశానని చెప్పారు.

ఏదో ఒక సమయంలో తాను రాజీనామా చేయాల్సిందేనని, ఇతరులపై ప్రభావం చూపకుండా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశానని, అందుకే రాజీనామాపై ముందుకు సాగానని చెప్పారు. తాను రాజీనామా చేసినప్పటికీ, పార్టీ కోసం పని చేసేవాడినని, ప్రచారం చేసేవాడినని చెప్పారు. కానీ కేడర్ ఒత్తిడితో రాజీనామాను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు.

శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్సీపీని స్థాపించారు. దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ అందరికీ షాకిచ్చారు. అయితే కేడర్ ఒత్తిడి కారణంగా రాజీనామాను ఉపసంహరించుకున్నారు.

ఎన్సీపీ విచ్ఛిన్నం కాదు

ఎన్సీపీ ఎప్పటికీ విచ్ఛిన్నం కాదని శరద్ పవార్ అన్నారు. ఎవరు కూడా పార్టీని వీడరని అజిత్ పవార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలాంటి కారణం, ఆధారం లేకుండా అజిత్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతను ఎప్పుడు ఫలితాలు అందించడం పైనే దృష్టి పెడతాడన్నారు. తాము కలిసి పని చేసి, ఫలితాలను చూపిస్తామన్నారు.

  • Loading...

More Telugu News