Telugudesam: మీకైతే ఒకలా.. మాకైతే మారోలానా?: జగన్‌ను సూటిగా ప్రశ్నించిన వర్ల రామయ్య
- రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీపై నిప్పులు
- నిబంధనల మేరకే రాజారావు తమకు అనుమతినిచ్చారన్న వర్ల రామయ్య
- రాజారావు బదిలీని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
రాజమండ్రి సెంట్రల్ జైలులో నిబంధనల మేరకు ములాఖత్‌కు తమకు అనుమతినిచ్చిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావును అప్పటికప్పుడు బదిలీ చేయడంపై టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయన బదిలీని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయి హైదరాబాద్ చంచల్‌గూడలోని జైలులో 16 నెలలు ఉన్నారని వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆ సమయంలో అధికారిక అనుమతులతో భార్య, తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీనేతలు జగన్‌ను కలిసేవారని అన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో కూడా నిబంధనల మేరకే ములాఖత్‌కు టీడీపీ నేతలకు అవకాశం లభించిందని, తమకు అనుమతినివ్వడం ఏమైనా నేరమా? అని ప్రశ్నించారు. అదేమైనా చట్ట వ్యతిరేకమా? అని నిలదీశారు. గిరిజన తెగకు చెందిన రాజారావు తమకు అనుమతినివ్వడమే ఏదో మహాపరాధం అయినట్టు ఎలా బదిలీ చేస్తారని దుమ్మెత్తి పోశారు.
రాజారావు 32 సంవత్సరాల సర్వీసులో చిన్న రిమార్కు కూడా లేదని, అలాంటి అధికారిని ఆగమేఘాలపై బదిలీ చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే ఆయన బదిలీని వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.