Cyberabad: కుళ్లిన అల్లం.. రసాయనాలతో పేస్ట్ తయారీ! హైదరాబాద్ లో కల్తీ ముఠా గుట్టురట్టు

Cyberabad police caught a gang making adulterated ginger garlic paste

  • లిటిల్ చాప్స్ మ్యాంగో కూల్ డ్రింక్ కూడా కల్తీ
  • కాటేదాన్ లోని పరిశ్రమపై సైబరాబాద్ పోలీసుల దాడులు
  • 500 కిలోల నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్ సీజ్

హైదరాబాద్ లో నిత్యావసర పదార్థాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్ లోని పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు దాడి చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన అల్లం, పాడైపోయిన వెల్లుల్లిలకు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కాటేదాన్ పారిశ్రామికవాడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు మ్యాంగో కూల్‌డ్రింక్ తయారుచేస్తున్నట్లు గుర్తించి దాడులు చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. బాగా కుల్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టు తయారు చేస్తున్నారని, పేస్ట్ బాగా ఘాటుగా ఉండేందుకు అసిటిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు మిక్స్ చేస్తున్నారని చెప్పారు. వెల్లుల్లిపాయల పొట్టును కూడా అందులో కలుపుతున్నారని చెప్పారు. పేస్ట్ తయారీలో మురుగు నీటిని వాడుతున్నారని తెలిపారు.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గత కొన్నేళ్లుగా ఈ పరిశ్రమను నడుపుతున్నారని వివరించారు. ఈ కల్తీ దందాపై సమాచారం అందడంతో ఆకస్మికంగా దాడులు చేపట్టి ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కంపెనీలో 500 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్టు, లిటిల్ చాప్స్ కూల్‌డ్రింక్స్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News