IAS: డైరెక్టర్‌గా మారిన తెలంగాణ మాజీ ఐఏఎస్.. షాక్ అయ్యానన్న కేటీఆర్
- శ్రియ ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ స్కూల్’ను తెరకెక్కించిన బియ్యాల పాపారావు
- తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ నెల 12న విడుదల
- నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్
సీనియర్ హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నటుడు షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ప్రకాష్ రాజ్, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఉంది. దీన్ని మాజీ ఐఏఎస్ బియ్యాల పాపారావు తెరకెక్కించడం విశేషం. ఏపీ, తెలంగాణలో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన దర్శకుడిగా మారి ఈ సినిమాను తీశారని తెలిసి ఆశ్చర్యపోయానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చాలామందిలో బయటికి కనిపించని ప్రతిభ ఉంటుందని, అలాంటి వారిని మనం ప్రోత్సహించాలనే సందేశంతో ఈ చిత్రం తీసిన పాపారావుకు అభినందనలు తెలిపారు. ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ఈవెంట్ వేదికగా తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఇళయరాజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నానని కోరారు. వెంటనే స్పందించిన ఇళయరాజా ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే తాను రెండు వందల మంది ఇళయరాజాలను తయారుచేస్తానని చెప్పారు. ఐఏఎస్‌గా పనిచేసిన తర్వాత మెగా ఫోన్ పట్టుకోవడం తనకు చాలా కొత్తగా అనిపించిందని పాపారావు అన్నారు. పదకొండు పాటలు కావాలని ఇళయరాజా దగ్గరకు వెళ్తే వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఆయన మ్యూజిక్ చేయనంటే ఈ సినిమా ఉండేది కాదని పాపారావు చెప్పారు.