Peoples Puslse: కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత... పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి
- కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు
- తీవ్రంగా ప్రచారం చేస్తున్న పార్టీలు
- సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ కోసం పీపుల్స్ పల్స్ సర్వే
- ఆసక్తికర అంశాలు వెల్లడి
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ కోసం నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ పార్టీకి 100కి పైగా స్థానాలు లభించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.
అధికార పక్షం బీజేపీ 100కి లోపు స్థానాలతో సరిపెట్టుకుంటుందని, జనతాదళ్ (ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ 24 స్థానాలకు పైగా సాధిస్తుందని వివరించింది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు లభించిన ఓట్ల శాతం 38.14 కాగా, ఈసారి అది 41.4 శాతానికి పెరుగుతుందని... 2018లో 36.35 శాతం ఓట్లు పొందిన బీజేపీ ఈసారి 0.3 శాతం తగ్గుదలతో 36 శాతం ఓట్లు పొందుతుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
2018లో కింగ్ మేకర్ గా నిలిచిన జనతాదళ్ (ఎస్) ఈసారి 16 శాతం ఓట్లు పొందుతుందని, గత ఎన్నికలతో పోల్చితే 2.3 శాతం తక్కువ అని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ- 105-117 స్థానాలు
బీజేపీ- 81-93 స్థానాలు
జేడీ (ఎస్)- 24-29 స్థానాలు
ఇతరులు- 1-3 స్థానాలు