the kerala story: తమిళనాడులోని మల్టీ ప్లెక్స్ లలో ‘కేరళ స్టోరీ’ ప్రదర్శనల నిలిపివేత
- శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న మల్టీప్లెక్స్ అసోసియేషన్
- అప్పటికే షెడ్యూల్ చేసిన షోలు కూడా రద్దు
- ‘ది కేరళ స్టోరీ’ చూడవద్దని ప్రజలను కోరిన నామ్ తమిళర్ కట్చి పార్టీ
వివాదాస్పదంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనను తమిళనాడులో మల్టీ ప్లెక్స్ లు నిలిపేశాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు పలు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు షోలు రద్దు చేసుకున్నాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ తెలిపింది.
‘ది కేరళ స్టోరీ’ని బ్యాన్ చేయాలని కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఈ ప్రకటన చేసింది. దీంతో అప్పటికే షెడ్యూల్ చేసిన షోలను కూడా రద్దు చేశారు. ప్రదర్శనలు కొనసాగిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే నిలిపేశామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) చెన్నైలో నిరసనకు దిగింది.
ఈ చిత్రానికి వ్యతిరేకంగా చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్‌లో 'నామ్ తమిళర్ కట్చి' పార్టీ నేత, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని నడపవద్దని థియేటర్ యజమానులకు సీమాన్ విజ్ఞప్తి చేశారు. సినిమాను చూడవద్దని ప్రజలను కోరారు.