Prisoners: టెన్త్ క్లాస్ పరీక్షల్లో యూపీ జైలు ఖైదీల ప్రతిభ
- ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఖైదీలకు మెరుగైన విద్యాబోధన
- ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన 60 మంది ఖైదీలు
- 57 మంది పాస్
- ఇంటర్ పరీక్షలు రాసిన 64 మంది ఖైదీలు
- 45 మంది ఉత్తీర్ణత
నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లే ఖైదీలను సంస్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వారికి చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని జైళ్ల శాఖ కూడా ఆసక్తి ఉన్న ఖైదీలకు విద్యాబోధన జరుపుతోంది. ఇటీవల యూపీలో జరిగిన పదో తరగతి పరీక్షలకు ఖైదీలు కూడా హాజరయ్యారు.
కొన్ని రోజుల కింద ఫలితాలు వెల్లడి కాగా, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ యూపీ జైలు ఖైదీల్లో 10వ తరగతి పరీక్షలు రాసిన వారిలో 95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 60 మంది ఖైదీలు టెన్త్ క్లాస్ పరీక్షలు రాయగా, 57 మంది పాసయ్యారు. వీరిలో కొందరికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి.
ఇక, కొందరు ఖైదీలు ఇంటర్ పరీక్షలు కూడా రాశారు. 64 మంది ఖైదీలు ఇంటర్ పరీక్షలు రాయగా, 45 శాతం మంది పాసయ్యారు. 70 శాతం ఉత్తీర్ణత సాధించారు.
దీనిపై ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ అధికారులు స్పందించారు. ఖైదీలు చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించామని, వారికి అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పరీక్షల సమయంలో ఖైదీలకు ఇతర పనులేవీ కేటాయించలేదని, తద్వారా వారు పూర్తిగా చదువుపై దృష్టి పెట్టే వీలు కల్పించామని చెప్పారు.